Pages

Saturday, 30 August 2014


తెలిసిన నిజం(కథ)

  • - పైడిమర్రి రామకృష్ణ, సెల్ నెం: 9247564699
  •  
  • 10/08/2014
ఉదయం పదిగంటలు అయింది. చల్లటి గాలి వీస్తోంది. గాలి వీచినప్పుడల్లా పూలపరిమళం గాలితోపాటు తేలివస్తోంది. మామిడి చెట్టుమీద కోయిల కూస్తోంది. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో పుస్తకం చదువుకుంటూ కూర్చోవటం చాలా ఇష్టం నాకు. అందుకే బస్సులు, ఆటోలు, ఇతరత్రా వాహనాల రణగొణధ్వనులకు దూరంగా ఊరిచివర ఇల్లు కట్టుకున్నాను. వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుంటే ఎదురిళ్లలోని పచ్చటి చెట్లు కంటికింపుగా కనిపిస్తూ ఉంటాయి.
ఆరోజు కూడా వరండాలో కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉన్నాను.
‘ఏమండోయ్! నేను మహిళా మండలికి వెళుతున్నాను. ఇల్లు జాగ్రత్త!’ అంటూ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని జడలోని పూలదండ సరిచేసుకుంటూ ఇంట్లో నుంచి వచ్చింది నా శ్రీమతి మాధవి.
చదువుకుంటున్న నన్ను చూడగానే ‘అబ్బబ్బ! పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నారూ! నేను అనుకుంటూనే ఉన్నాను. ఈరోజు ఆదివారం కదా! ఒక సరదా లేదు, ఏం లేదు. ఎప్పుడూ చదువుకుంటూ కూర్చుంటారు. ఏముందండీ ఆ రామాయణంలో, భారతంలో! శూర్పణఖ రాముడిని ప్రేమించింది. ఇష్టం లేకపోతే లేదని చెప్పవచ్చుగా! బంగారం లాంటి ఆమె ముక్కు చెవులు కోసేశాడు. కృష్ణుడు మాత్రం? ‘ఏదో పసిపిల్లాడు కదా! పాలిద్దాం’ అని వచ్చింది పూతన. ఆమె ప్రాణాలు తీసేశాడు. మాతృత్వంలోని మాధుర్యం గురించి మీ మగవాళ్లకి ఏం తెలుసండీ! స్ర్తిలు అందరూ దుర్మార్గులూ, స్ర్తిలను హింసించే వాళ్లందరూ దేవుళ్లూనా? ఛీ!్ఛ! అశ్లీల సాహిత్యాన్ని నిషేధించినట్లు ఈ పురాణాలని కూడా నిషేధిస్తే కానీ జనం బాగుపడరు. ఈరోజు మహిళా మండలిలో నేను ఉపన్యసించబోయే అంశం కూడా ఇదే!’ అన్నది.
‘సరేలే! నీకు ఆలస్యం అవుతుంది, వెళ్లు వెళ్లు!’అన్నాను.
మాధవి వరండా మెట్లు దిగి నాలుగు అడుగులు వేసింది. అక్కడ కుండీలో సన్నజాజి మొక్కను చూస్తూ ‘ఏమండీ! మొన్న మా పుట్టింటి నుంచి తెచ్చుకున్న సన్నజాజి మొక్క అప్పుడే ఎంత పెద్దదయిందో చూశారా! బుజ్జిబుజ్జి మొగ్గలు కూడా వేస్తోంది పిచ్చిముండ! సన్నజాజి పూలంటే నాకెంత ఇష్టమో!’ అని మురిపెంగా చూస్తూ వెళ్లింది.
నేను మళ్లీ చదవటంలో మునిగిపోయాను. చుట్టుపక్కల పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. అలా ఒక గంట గడిచింది. గేటు తీసిన శబ్దం అయింది. మాధవి తిరిగి వస్తోంది. పూలమొక్కలు మేస్తున్న గేదెను అదిలిస్తూ ‘్ఫ! ఫో! పాడు గేదె’ అంటూ పుల్ల తీసుకుని తోలేసింది.
నా దగ్గరకు రుసరుసలాడుతూ వచ్చి ‘నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న సన్నజాజి మొక్కను పక్కింటి వాళ్ల గేదె తినేస్తుంటే చూస్తూ కూర్చుంటారే! కర్ర తీసుకుని నాలుగు తగిలించకుండా..’ అన్నది కోపంగా.
‘నీ పూల మొక్కని తినేసేది ‘దున్న’ అయితే అలాగే తనే్నవాడిని. కానీ అది గేదె. నీ వాదన ప్రకారం స్ర్తిజాతి హింసకు గురికాకూడదు కదా! అందుకే చూస్తూ ఊరుకున్నాను’ అన్నాను.
‘సంతోషించాంలే!’.. అంటూ మాధవి చరచరా ఇంట్లోకి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ టీపాయ్ మీద పడేసి సోఫాలో పడుకుంది.
నేను కూడా లోపలికి వచ్చి ‘అప్పుడే మీటింగ్ అయిందా? వెంటనే వచ్చాశావే!’ అన్నాను పక్కన కూర్చుంటూ. మాధవి చివాలున లేచి అమ్మవారిలా చూస్తూ ‘పురాణాలను నిషేధించాలని నేను ఉపన్యసిస్తున్నానా! ఎంపిడిఓ గారి భార్య మధ్యలో అడ్డువచ్చి నా వాదన అంతా తప్పేనని కొట్టిపారేసింది. దాంతో నాకు తిక్కరేగి మీటింగ్ మధ్యలోనే లేచి వచ్చేశాను’ అన్నది.
‘మంచిపని చేశావు’ అన్నాను తాపీగా.
‘ఏమిటీ!’ అన్నది కోపంగా.
‘కూల్ డౌన్! కూల్ డౌన్! కోపం తగ్గించుకుని నిదానంగా ఆలోచించి చూడు. ఎన్నో కోట్ల మంది ప్రజలు వేల సంవత్సరాలుగా శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని దేవుళ్లుగా పూజిస్తున్నారు. వారంతా తెలివితక్కువ వాళ్లేనంటావా? శూర్పణఖ భర్తని రావణుడు చంపేస్తాడు. అతని మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. కానీ అబల ఏం చేయగలదు? ‘రావణాసురుడిని వధించగలిగేది రాముడొక్కడే!’ అని చెపుతాడు నారదుడు. ‘అయితే వెంటనే రాముడి దగ్గరకు వెళ్లి రావణుణ్ణి వధించమని ప్రార్థించనా?’ అంటుంది. ‘ఓసి పిచ్చిదానా! రాముడెంత పరాక్రమవంతుడైనా అన్యాయంగా ఎవరికీ హానిచేయడు. రాముడికి రావణుడి మీద కోపం కలిగేటట్లు చెయ్యి. నీ అభీష్టం నెరవేరుతుంది’ అని ఉపాయం చెప్పి చక్కా పోతాడు నారదుడు. అప్పుడు శూర్పణఖ రాముడి చేత పరాభవింపబడినట్లుగా నటించి, సీతను అపహరించుకు రావటానికి రావణుడిని పురిగొల్పుతుంది. రావణుడు కూడా రాముడి చేతిలో మరణించేటట్లు వరం కోరుకుని ఉన్నాడు. కాబట్టి విధి ప్రేరితుడై వెళతాడు’.
‘అలాగే కంసుడికి శ్రీకృష్ణుడి చేతిలో చావు రాసిపెట్టి ఉంది. కానీ అతడి జాడ తెలియదు. దేశంలోని బాలపాపల్ని అందరినీ చంపమని తన అనుచరులను పంపుతాడు. వారిలో పూతన ఒకతె. తన స్వార్థం కోసం పసివాళ్లందరినీ చంపడం అన్యాయం కాదా! అందుకే కృష్ణుడు పూతన ప్రాణం తీసేశాడు. ఇవన్నీ పురాణాలని లోతుగా చదివితే కానీ అర్థం కావోయ్ అమాయకురాలా!’ అన్నాను.
‘ఏమిటోనండీ! నేనేమైనా మీకులాగా అంత పెద్దపెద్ద పుస్తకాలు చదివానా? చేశానా? టీవీలో పౌరాణిక సీరియల్స్ చూస్తుంటే దేవుళ్లందరూ దుర్మార్గుల్లాగా కనిపించారు. రేపటి నుంచి నేను కూడా టీవీ చూడటం తగ్గించి పుస్తకాలు చదవటం అలవాటు చేసుకుంటాను’ అన్నది మాధవి.
‘మంచిది’ అన్నాను నవ్వుతూ.

No comments:

Post a Comment