Pages

Wednesday, 20 August 2014


ఎడ్వంచర్ (కథ)

  • 17/08/2014
  •  | 
  • -నర్సాపేట ఒత్సల
ఎర్రమట్టి లైసెన్సు కోసమో, పందిపెంట పర్మిట్ కోసమో మాడిశెట్టి మాణిక్యాలు గుప్త ఆదరాబాదరా సిటీకి వెళ్లవలసి వచ్చింది.
‘‘ఎందుకయినా మంచిది! ఎటిఎంలో డబ్బేసి, అక్కడికి పోయింతర్వాత మళ్లీ అక్కడ ఎటిఎంలో గోకి తీసుకో!’’ ముందు చూపు గాక ముందు చూపున్న మిత్రుడు విశ్వనాధం గుప్త అడక్కుండానే సలహా ఇచ్చాడు.
‘‘శింగినాదం! జీలకర్ర! ఆ ఎటిఎంలు గోకటాలు, నాకటాలు నాకు తెలవ్వు! అదీకాక ఎటిఎంలో వేసేసిన డబ్బే చాకచక్యంగా దొబ్బేస్తున్నారట! అసలు రోజులు బాగాలేవు!’’ అన్నాడు మాణిక్యాలు గుప్తా.
తగుమాత్రంగా నిట్టూర్చి,
‘‘సరే! నీ ఇష్టం! నువ్వెడుతున్నది పట్నం! అక్కడ చోరులు, జారులు, క్రూరులు, సంఘ విదూరులు జాస్తిగా ఉంటారని వింటున్నాం! పట్టపగలే గత మాసం కాలేజీకి వెళ్లే అమ్మాయిని నలుగురు కుర్రాళ్లు డోర్‌లేని జీపులో పడదోసి-వూరు బయటికి తీసుకుపోయి రాక్షసంగా చెరిచేరుట! పేపర్లో వేసారు! తర్వాత నీ ఇష్టం!’’ అన్నాడు విశ్వనాధం గుప్త.
‘‘అదికాదూ! ఖర్చులికి ఓ అయిదువేలు జేబులో వేసుకుపోతున్నాను! అంతగా అక్కడ ఇంకా డబ్బవసరం పడితే ఇంటికొచ్చి డీడీ పంపిస్తాను!’’
‘‘సర్లే! డబ్బులేకుండా ఈరోజుల్లో పన్లవుతయ్యా? మనిషి గుండెకాయే డబ్బు, డబ్బు అని కొట్టుకుంటుంది! నీకు తెలవందేముంది? కొబ్బరికాయ కొట్టకుండా, ముడుపులు కట్టకుండా దైవదర్శనమే కాదు! ఇది ప్రజాస్వామ్యం!’’ అన్నాడు విశ్వనాథం.
‘‘చెప్పేను గదా! ఏమైనా దండిగా పిండి పెట్టవలసి వస్తే వాపస్ వచ్చేక డిడి తీసి పంపిస్తానని?’’
‘‘సర్లే! ఇంతకీ పట్నంలో ఎవర్ని కలవాలని వెడుతున్నావ్?’’
‘‘ఇంకెవరు! ఉన్నాడుగా మనూరి ఏడుచింతల ఏడుకొండలు? లఘు పరిశ్రమల మంత్రి కింద పనిచేసే పి.ఎస్.
‘‘ఓహో! ఏకాంబరం కొడుకు ఏడుకొండలా! ఐతే నువ్వు సిటీలోని మైసూర్ హోటల్‌కి వెడితే ఆయన్ని వీజీగా పట్టుకోగలవు! మన వూరు వాడే కాబట్టి నీ పని కొద్దిలో అయిపోచ్చు!’’ అన్నాడు విశ్వనాథం
‘‘సరే! మర్నే వస్తాను. రాత్రికి ప్రయాణం, గుడ్డ గోచులు సర్దుకోవాలి!’’ అన్నాడు మాణిక్యాల గుప్త.
‘‘సర్దు కోవడం సరే! నువ్వేమో చూడబోతే పుట్టి బుద్ధెరిగి ఎన్నడూ వూరి పొలిమేర దాటి ఎక్కడికీ వెళ్లని ఆగర్భ అర్భకుడివి! జేబులో డబ్బు, దస్కం జాగర్త! అక్కడ ఆలోచిస్తూ నించుంటేనే కన్రెప్పలు కత్తిరించుకుపోయే జాదూగాళ్లుంటారు! రిక్షా వాళ్లు కూడా కొత్తవాడివని వాసన పట్టేరో-అడ్డగోలుగా కిరాయి చెప్పి మూలగ లాగుతారు!’’ అన్నాడు అనుభవజ్ఞుడయిన విశ్వనాధం.
‘‘ఆయ్! నేనంత వెర్రి వెంగళప్పనా ఏం?’’ అన్నాడు మాణిక్యాల గుప్త.
‘‘అంటే ఎంతో కొంత వెర్రివెంగళప్పవని ఒప్పుకున్నట్టేగా? వెధవ్వేషాలు మాని నా మాట విని ఒక పని చెయ్’’
‘‘ఒకటి కాకపోతే రెండు పన్లు చేస్తా! ఏంటవి?’’
‘‘ఎక్కడికి వెళ్లినా రిక్షా బాడుగ ఐదులోపు బేరమాడు! ఆంతకన్నా ఎక్కువ పెట్టమాకు! ఆరిపోతావ్!’’ అన్నాడు విశ్వనాధం.
* * *
ఎర్రబస్సులో గుంటూరు వెళ్లి, అక్కడ రైల్వే బుకింగ్‌లో సెకండు క్లాసు టిక్కెట్టు తీసుకుని పట్నం వెళ్లే రైలెక్కాడు మాణిక్యాలు
దేశ పౌరులని పుక్కిటబట్టి-రైసు మిల్లులో జల్లెడలా వూగుతూ వానపాములా రైలు సాగిపోయింది.
ఎవరివైనా తెలిసిన మొహాలు కనబడతాయేమోనని ఆశతో కంపార్టుమెంట్లో చూపులు తిప్పి చూసాడు. ఉహు! మాణిక్యాలు గుప్తాకి తెలిసిన ఒక్క శాల్తీ కూడా తగల్లేదు.
సోడా మిషన్ గ్యాస్ వదిలినట్టు నిట్టూరుస్తూ కిటికీకి ఎదర లాంగ్ బెంచీ మీద ఖాళీ జాగా దొరికి-చటుక్కుని మ్యూజికల్ చెయిర్ ఆటల్లో మల్లేకూర్చున్నాడు. ఆ లాంగ్ బెంచీకి హాయిగా ఆనుడు కూడా ఉన్నది.
ఎదర కిటికీలోంచి చల్లగాలి హోళీలో పిచికారీతో వసంతం చిమ్మినట్టు వీస్తున్నది.
తనకి తెలీకుండానే కళ్లు మూతలు పడుతుంటే బెంచీకి ఆనించిన నడుం ముందుకు లాక్కున్నాడు.
పేసింజరు రైలు చిన్న స్టేషన్లలోనూ ఆగుతూ, ఇష్టంలేని పెళ్లి కూతురు కాపురానికి వెడలినట్టు పోతున్నది.
ఒళ్లు పెరిగిన వాళ్లమల్లే చెట్లు, చేమలు విరుచుకుపడిపోయున్నాయ్ గాలిని కోసుకుంటూ- వుండి వుండి బొంగురు గొంతుకతో కూత పెడుతూ రైలు వెడుతున్నది.
సిటీ సమీపిస్తున్నదో ఏమో-కంపార్ట్‌మెంట్‌లో అలబలం ఉద్ధృతమవుతున్నది. ఎవరికి వారు సామాన్లు సర్దుకునే పనిలో ఉన్నారు.
ఏమీ తోచక ఎదర కిటికీకి ఆనుకుని కూచున్న పెద్దమనిషిని అడిగేడు మాణిక్యాలు
‘‘మీరెందాకా?’’
‘‘నేను పట్నం! మీరెక్కడికి?’’ అడిగాడు కిటికీకి తల అంకితం చేసి కూచున్న వ్యక్తి.
‘‘నేను సిటీకి కాదులెండి! మరో చోటికి వెళ్లాలి.’’
కిసుక్కున రబ్బరు ముక్క అడ్డంపెట్టి గోలీ సోడా కొట్టినట్టు నవ్వేడా వ్యక్తి.
‘‘ఏవిటో వెర్రిమాలోకం! పిచ్చిబట్టినట్టు నవ్వుతాడేమిటీ! తను చెప్పిన సమాధానంలో నవ్వు మొలిపించే మాట ఏముందీ?’’ అనుకున్నాడు మాణిక్యాలు గుప్త.
గొడుగుని చూసిన గొడ్డులా పరికించేడు.
తననే చూస్తూ- వెలువడే నవ్వుని బలంతంగా ఆపుకుంటున్నాడు కిటికీ పక్క జాగా తాత్కాలికంగా రిజిస్టరు చేసుకున్న పెద్ద మనిషి.
మాణిక్యాలు గుప్త అదేమీ పట్టించుకోకుండా తలవంచుకుని గోళ్లలో మట్టి తీసుకుంటూ కూచున్నాడు.
అంతలో పెట్టెలో
‘‘పట్నం వచ్చింది! పట్నం...! అలబలంగా అంటున్నారు జనం.
తత్తరపడుతూ లేచి నించుని-రద్దీలో జనాన్ని నెట్టుకుంటూ పోతే ఎక్కడ పక్క జేబులో పైకం చక్కగా కొట్టేస్తారోనన్న భయంతో నిదానంగా, గాలిలో గంధర్వుడులా రైలుపెట్టె దిగి ప్లాట్ ఫాం మీద కాలుపెట్టాడు.
ఆశ్చర్యం! తనతో మరో చోటికి వెళ్లాలన్న పెద్దమనిషి ప్లాట్ ఫాం మీద నిలబడి దర్శనమిచ్చేడు.
‘సందేహం లేదు! వీడెవడో పాకెట్ మార్! పెద్దమనిషి రూపంలో వున్న ఆషాఢభూతి!’ అనుకుంటూ చకచక మరో అడుగు వేసి-టిక్కెట్లు గుంజుకునే గేటు దగ్గరకొచ్చాడు. నెత్తిన రాళ్ల గుట్టలా లగేజి పెట్టుకుని-లైసెన్సు కూలీలు ఓ పట్టాన గేటు దాటి వెళ్లనిచ్చేరు కాదు, పెన్‌గ్విన్ పక్షిలా గేటు చెంత నిలబడ్డ టిక్కెట్ల కలక్టరు చకచక చేతులాడిస్తూ టిక్కెట్ ముక్కలు తీసుకుంటున్నాడు.
జనాన్ని తప్పుకుని-యంత్రంనుంచి నట్టూడిపడ్డట్టు స్టేషన్ దాటి బయటకొచ్చేసరికి పావు గంట పట్టింది.
బయట రిక్షావాళ్లు-గుడి దగ్గర బిచ్చగాళ్లమల్లే ఎగబడుతున్నారు.
మరీ మీసాల్లేని ఓ పిల్లిగడ్డం రిక్షావాడు-విడవకుండా మాణిక్యాలు గుప్త అడుగులో అడుగువేస్తూ
‘‘కహా జానా సాబ్! కహా జానా?’’ అంటూ వదలడంలేదు.
నింగిని కాకులు గాలిలో ‘క్యావ్? క్యావ్?’ అని హిందీలో ఏమిటో అడుగుతున్నవి.
‘‘చూడ చూడ ఇక్కడంతా హిందీ మాధ్యమంలావుందే? అవునే్ల హిందువులకి హిందీ మాధ్యమం గాక సింధీ మాధ్యమంగా ఉంటుందా? అనుకునేటంతలో
‘‘కహా జానాసాబ్?’’ అని తన వెంట బడ్డ రిక్షావాడు కంటగింపుగా పాట పాడుతున్నాడు.
‘‘మైసూరు! మైసూరు హోటల్‌కి పోవాలి!-వెల్లకితల పడ్డ బొద్దింకలా చేతులాడిస్తూ చెప్పాడు.
‘‘హా! లే జాయింగే సాప్! కిత్తే సవారీ?’’
‘‘సవారా? సవారేమిటి? నేనేం గుర్రాన్నా, లొట్టిపిట్టనా? సవారీ, జువారీ ఏం లేదు.! నేను-నేను మైసూర్ హోటల్ గయా!’’ చేతులాడిస్తూ చెప్పాడు మాణిక్యాలు గుప్త.
‘‘అచ్ఛా! అచ్ఛా! లేజాయింగే సాబ్!’’ అన్నాడు మేకపోతు గడ్డం రిక్షావాలా.
‘‘ఎంత? ఎంతకి వుతర్తావ్?’’-పిడికిలి బిగించి పైకి కిందికి ఆడిస్తూ అడిగేడు మాణిక్యాలు.
‘‘దేఢ్ రూప్యా దిలాయియే సాబ్!’’
‘‘దౌడ్ రూప్యా లేదు, తౌడ్ రూప్యా లేదు! ఐదు-ఐదు రూపాయలిస్తా! నీకిష్టమైతే రా! లేకపోతే పో!’’ కాంగ్రెస్ ఎన్నికల గుర్తు చూపిస్తూ అన్నాడు మాణిక్యాలు.
‘‘హోరి పిచ్చిముండా బేటా! ఐదు రూపాయలిస్తానంటే నాకేమైనా చేదు?’’ అనుకుంటూ
‘‘గట్లనే యియుండ్రి సాహబ్! మా అసుంటి గరిబోల్లకాణ్ణేగదా మీరు బేరమాడేది?’’ అన్నాడు.
‘‘అట్లారా దారికి!’ అని మనసులోనే అనుకుంటూ రిక్షా ఎక్కాడు మాణిక్యాలు గుప్త...
స్టేషన్‌నుంచి కుడివెంపు కొంచెం దూరం వెళ్లి-అక్కణ్ణించి లెఫ్టుకి తిరిగితే మైసూరు హోటల్ వస్తుంది. ఐతే ఆ కాస్త దూరానికే ఐదు రూపాయలా! అని పేచీ పెడతాడేమోనని సందేహించి-తిన్నగా మార్కెట్ వరకు వెళ్లి అక్కడినుంచి ఎడం చేతివైపు మండి సందులో గుండా వచ్చి మైసూర్ హోటల్ దగ్గర దింపేడు రిక్షావాలా!
పట్టిన చెమట తల గుడ్డతో తుడుచుకుంటూ
‘‘ఉస్! అబ్బ! చాలా చడావ్ వున్నది సాబ్! ఔర్ ఏక్‌రూపాయిప్పించుండ్రి!’’ అన్నాడు రిక్షావాలా.
‘నిజమే పాపం’ చాలా దూరం తీసుకొచ్చేడు-అదీ మోసగించి ఏ వూరు బయటకో తీసుకుపోయి, బెదిరించి జేబులో డబ్బులు లాక్కోకుండా!’ అనిపించించింది మాణిక్యాల గుప్త గారికి!
అందుకే వాడు కోరినట్టు ఐదుకి మరో రూపాయి జతచేసి ఇచ్చేడు. ఆ తర్వాత అంబాసిడర్లో లఘు పరిశ్రమల మంత్రిగారి పర్సనల్ సెక్రటరీ ఏడుకొండలు గారి ఇంటికి తీసుకుపోతానని నమ్మించి మరో తెలుగు సోదరుడు రెండువేలు కొట్టేశాడనుకోండి! అది మరో అధ్యాయం!

No comments:

Post a Comment