Pages

Thursday, 28 August 2014

విందు భోజనం ( కథ)

  • 03/08/2014
  • |
  • జీవన్
‘‘ముహుర్త సమయం ముంచుకొస్తుంటే తెమలకుండా బెల్లం కొట్టిన రాయల్లే ఇంకా కూర్చునే ఉన్నావేం?’’ ముందు గదిలో ఏదో పుస్తకంలో నిమగ్నమై వున్న నన్ను తొందరపెడుతూ అంది వింధ్య. రాత్రెప్పుడో ఏడున్నరకు పెండ్లనగా మధ్యాహ్నం నుంచే తెగ హడావుడి చేస్తున్నది.
‘‘ఇంకా అయిదైనా కాలేదు, ఏమిటా ఆరాటం’‘ పుస్తకంలో లీనమయ్యే సమాధానమిస్తున్న నాతో- ‘‘ప్రాణ స్నేహితుని ఇంట్లో పెండ్లవుతుంటే ముహుర్తం వేళకే వెళ్తే ఏం బాగుంటుంది- అయినా ఓ పూట ముందే రమ్మన్నాడుగా మీ స్నేహితుడు!’’ అంది.
నిజానికి సురేశ్ నాకిప్పుడు ప్రాణస్నేహితుడేం కాదు. బాల్యంలో మాత్రమే అట్లా ఉండేవాళ్లం. అతను ఇంజనీరింగ్ కాలేజీలో చేరినప్పటినుండి ఆ స్నేహం కొంచెం కొంచెంగా పలచబడుతూ ఇప్పుడేమో అప్పుడప్పుడు కలుసుకునే స్థాయికి దిగింది. అదీ ప్రత్యేక సందర్భాల్లోనే.
‘‘అంగ రంగ వైభవంగా జరిగే ఆ వివాహానికి మనం వెళ్లాలంటావా?’’ అన్నా-వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలోనే ఉన్న నేను. ‘‘గరంగరమేమిటి-ఇంటికల్లా వొచ్చి అంత స్వీట్ స్వీట్‌గా ఆహ్వానిస్తేనూ!’’ అంది. నా మాటలకు ప్యారడీలు అల్లి నన్ను వేళాకోళం చేయడం ఆమెకు సరదా.
అంగ రంగ వైభవమని ఎందుకన్నానంటే సురేశ్‌తో వియ్యమందే పెద్దమనిషి నీటిపారుదలల్లో ఓ పేద్ద కాంట్రాక్టరు. కాలువల్లో చుక్కనీరు పారించకుండానే తన అకౌంట్లో భారీగా బిల్లులు పారించుకోగలిగే ఉద్ధండుడు. మా సురేశేమో ఆ ‘పారుదల’ కోసం అహోరాత్రులు శ్రమించే చీఫ్ ఇంజనీర్. పర్సంటేజీలు కాకుండా వాటాలే ఉన్నాయంటారు ఆయన సన్నిహితులు. ఇహ ఆ ఇద్దరి ఉద్ధండుల కాంబినేషన్ సూపర్‌స్టార్‌ల కాంబినేషన్‌లా కాకుండా మరెట్లా ఉంటుంది?
వింధ్య అన్నట్టుగా ఇంటికొచ్చి స్వీట్ స్వీట్‌గానే ఆహ్వానించాడు. కానీ, బడా బడా వ్యాపారవేత్తలూ, బ్యూరోక్రాట్లూ, పొలిటీషియన్ల కోలాహలాల వివాహ మహోత్సవంలో మనల్నెవరు కానతారు-అందునా ఆఫ్ట్రాల్ ఓ సామాన్య లెక్చరర్‌ని.
నా సందిగ్ధాన్ని పటాపంచలు చేస్తూ చేతిలోని పుస్తకాన్ని లాగి టేబుల్‌మీద పడేసి తొందరగా తెమలండంటూ మరీ తొందర చేసింది వింధ్య. అప్పటికే అలంకారాలన్నీ పూర్తి చేసుకుని ఉంది. పట్టుచీర సింగారించి ఉన్నంతలో నగలు ధరించింది. అమ్మాయి సుమని పట్టుపావడా ఓణీలో ముస్తాబు చేసింది- ఈ వేషం నాకొద్దు మొర్రో అని అది ఎంత గోలపెడుతున్నా వినకుండా. మా అబ్బాయేమో జీన్స్‌తోఅల్ట్రా మాడ్రన్‌గా తయారయ్యాడు-ఇంజనీరింగ్ స్టూడెంటాయె! నేను గవర్నమెంటు కాలేజీలో విద్యాబోధన చేస్తున్నా నా పిల్లలకు మాత్రం ‘ప్రైవేటు చదువులు’ కొంటూనే ఉన్నా లక్షలు పోసి. వాడికి ఇంజనీరింగ్, దానికి కంప్యూటర్ సైన్సూ.
ఎట్లాగూ హై క్లాస్ సొసైటీకి ఎగబాకలేం కనుక ఆ సొసైటీ వేడుకలెట్లా ఉంటాయో చూద్దామని తెగ ఉబలాటపడుతున్నది వింధ్య. పెండ్లికి ఆహ్వానించడానికి వచ్చిన సురేశ్‌నుంచి
కొంత సమాచారం సేకరించగలిగింది నేర్పుగానే. కట్నం విషయం అసలు పట్టించుకోలేదు, అమ్మారుూ అబ్బారుూ ప్రేమించుకున్నారు, ఇష్టపడ్డారు, తథాస్తు అన్నాం అంతే-అని మాత్రమే మావాడు అన్నాడు. బడా నీటిపారుదల కాంట్రాక్టరు ఏకైక కుమార్తెను అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పీహెచ్‌డీ చేసే తన కుమారుడు ప్రేమించాడు. అల్ట్రా మాడ్రన్ యువతీ యువకులు ‘ప్రేమ’ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తారనడానికి ఇదో ఉదాహరణ. కాస్ట్, క్లాస్, స్టేటస్, ఎడ్యుకేషన్-ఇట్లా అనేక తూనిక రాళ్లతో కొలిచి మాత్రమే ‘ఐ-లవ్-యూ’ చెప్పేస్తారు. అట్లా మావాడి ముద్దుల తనయుడితో బడా కాంట్రాక్టరుగారి ఏకైక గారాలపట్టి ప్రేమ వివాహం నిశ్చయమైంది.
మరో గంటకల్లా వివాహ వేదికకు చేరుకున్నాం. మా పట్నంలోని పెద్ద చెరువు ఆక్రమించుకుని పదుల ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ గార్డెన్ కమ్ ఫంక్షన్ హాల్ అది. ఎక్కడికక్కడ లాన్సూ, క్రోటన్సూ, పూలమొక్కలు, లతలూ, కొబ్బరి, ఖర్జూర, పోక చెట్లతోనూ ఫౌంటెన్స్‌తోనూ కళకళలాడుతున్నది. రంగురంగుల విద్యుద్దీపాల కాంతులు వాటిని మరింత శోభాయమానం చేస్తున్నవి. క్రమపద్ధతిలో వేల సంఖ్యలో ఎవరి తాహతుకు తగ్గట్టుగా వారికి ఆసనాలు ఏర్పాటు చే సారు. కార్తీక మాసపు ఆహ్లాదకర వాతావరణానికి తోడు సరస్సునుండి వీచే చల్లని గాలులతో మనోల్లాసంగా ఉంది. యంత్రాలు విరజిమ్ముతున్న రకరకాల పెర్‌ఫ్యూమ్‌లు గాలుల్ని మత్తెక్కిస్తున్నాయి. అందంగా అలంకరించిన విశాలమైన వేదికమీద క్రతువును అందరూ స్పష్టాతిస్పష్టంగా వీక్షించడానికి వీలుగా ఎక్కడికక్కడ వెడల్పాటి డిజిటల్ తెరలేర్పాటు చేసారు. వచ్చే అతిథులూ వాళ్లని ఆహ్వానించేవాళ్లతో అంతటా కోలాహలంగా ఉంది. అటు, ఇటు బెరుకు బెరుగ్గా చూస్తూ లోనికి వస్తున్న నన్ను చూసి సురేశ్ పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా షేక్ హ్యాండిచ్చి వియ్యంకుడికి పరిచయం చేయబోతుండగానే మంత్రిగారెవరో వస్తున్నారని సెక్యూరిటీ వాళ్లు హడావుడి మొదలుపెట్టారు. ఆ వియ్యంకుడు నావైపో చిరునవ్వు విసిరి మంత్రిగారిని సాదరంగా ఆహ్వానించడానికి గోచీ సర్దుకుంటూ పరుగులు తీసాడు. నన్ను, నా కుటుంబాన్నీ మరో వ్యక్తికి అప్పజెప్పి మావాడూ అటే పరుగు తీసాడు.
మాంగల్యధారణ, తలంబ్రాలూ అయిపోగానే ప్రముఖులొక్కక్కరుగానూ జంటలగానూ, గుంపులుగానూ వధూవరులను ఆశీర్వదిస్తూ యధోచితంగా కానుకలని అందిస్తున్నారు. ఫొటోగ్రాఫర్లూ, వీడియోగ్రాఫర్లూ, టీవీ కెమెరావాళ్ల ఆర్భాటం చెప్పనలవి కాకుండా ఉంది. రకరకాల పోజుల్లో ఫొటోలు తీసుకుంటున్నారు. కొద్దిగా రద్దీ తగ్గగానే మేమూ అక్షింతలు వేశాం. భోంచేసి వెళ్లండని మావాడు మరోమారు గుర్తు చేసాడు. పరిచయస్తులెవరున్నారా? అని వెతుకుతుంటే బ్యాంకు మేనేజరు, మా ఫ్యామిలీ డాక్టరు వారి వారి కుటుంబాలతో సహా తారసపడ్డారు. ప్రాణం కుదుటపడ్డట్టనిపించింది.
అటుపక్కన విశాల ప్రాంగణంలో డైనింగ్‌కు ఏర్పాటు చేసారు. ఈ కొస నుండి ఆ కొసదాకా వరసల్ని పరిశీలిస్తూ ‘ఒక్కసారి ఎంతమంది భోం చేయొచ్చో’ అన్నాను అటు, ఇటు చూస్తూ. ‘మాథెమెటిక్స్ లెక్చరర్ గదా, మీరే చెప్పండి’ నవ్వుతూ అన్నాడు బ్యాంకు మేనేజరు. ‘అయిదారువేలకు తగ్గరు..’ అన్నా ధీమాగా. ‘పాతిక, ముప్పైవేలమందికైనా భోజనాలు పెట్టందే వాళ్ల హోదాకు భంగం కాదూ!’ అన్నారు డాక్టరు గారు. వింధ్యకూ, పిల్లలకూ స్నేహితులు దొరకడంతో ఉల్లాసంగా ఉన్నారు.
అందరం ఒకే పంక్తిలో కూర్చున్నాం. పసుపురంగు పేపరు పరిచిన టేబుల్సు మీద పెద్దపెద్ద ప్లాస్టిక్ అరిటాకులు వేసారు. యూనిఫాంలో వున్న యువతీ యువకులు చకచకా వడ్డిస్తున్నారు. నాలుగు రకాల స్వీట్లు, అరటికాయ, మిరపకాయ బజ్జీలు, ఘుమఘుమల బిర్యానీ, ఖుర్మా వడ్డించారు. మా కుడివైపున కూర్చున్న వృద్ధుడు ‘ఒద్దంటుంటే వడ్డిస్తారేమయ్యా స్వీట్లూ, నేనసలే సుగర్ పేషంటును, కడుపులో సుగర్ మిల్లుంది. మూడొందలు దాటింది’ అంటూ గగ్గోలు పెడుతున్నాడు. ‘అంత మిల్లుండగా ఈ నాలుగేమవుతాయ్ తినండి’ అంటున్నాడు మేనేజర్ నవ్వుతూ. ‘నీకేం నాయనా.. మిల్లు ఒక్కసారే భళ్లుమంటుంది-ఇంటికైనా చేరకముందే’ అన్నాడు ఆ పెద్దాయన అంతే పరిహాసంతో. ‘పక్కనే డాక్టరుగారున్నారులే భయంలేదు’ అన్నానే్నను. ‘డాక్టర్ల ఫీజులతో ఇల్లు గుల్లయింది కానీ వ్యాధి మాత్రం తగ్గట్లేదు’ అన్నాడు ఆ వృద్ధుడు మిరపకాయ బజ్జీ కొరుకుతూ. డాక్టరుగారు చిన్నబుచ్చుకున్నట్టున్నారు-‘మీరు పెంచుకుంటుంటే మేమేం చేస్తాం?’ అన్నారు. ‘కళ్ల ముందు ఊరిస్తుంటే నోరెట్ల కట్టుకుంటాం నాయనా!’ జాంగ్రీ ముక్కన నోట్లో పెట్టుకుంటూ నవ్వాడు. వాతావరణం తేలికపడింది.
అన్నమూ, రకరకాల కూరలు, వేపుళ్లు,పప్పు పచ్చళ్లు, సాంబారు వడ్డిస్తూనే ఉన్నారు. ‘పది పొట్టలు అరువు తెచ్చుకున్నా చాలేట్లు లేవే’ అన్నాడొకాయన వద్దంటున్న వినకుండా వడ్డిస్తున్న తీరు చూసి. ‘అది వాళ్లడ్యూటీ, తిన్నంత తిని మిగతాది పారేయ్’ అన్నాడు మరొకాయన.
అంతే అన్పిస్తున్నది. తిన్నవాటికంటే పారేసిన పదార్ధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెరుగు కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే ఆఖరి పంక్తిలో కలకలమేదో విన్పించి అటు చూశాం. మాసిన బట్టల్లోని ఓ యువకుడు టేబుల్ ముందు కూర్చుని గబగబ తినేస్తున్నాడు పెద్ద పెద్ద ముద్దలు కలుపుకుని. ఎక్కడినుంచొచ్చాడో ఒక నడీడు తుమ్మ మొద్దు లాంటి మనిషి ‘ఎవరి తరఫునుంచొచ్చావ్’ అంటూ గద్దిస్తున్నాడు అతన్ని. ‘‘అన్నం...అన్నం..’ అంటూ తడబడుతూ సమాధానమిస్తున్నాడు వాడు. ‘ఎవరి తరపోడివి’ అంటూ వాడి కాలర్ పట్టి లేపాడు. ‘ఆకలి...ఆకలి..’ సమాధానం చెబుతున్నాడు వాడు. ‘అన్నసత్రమనుకున్నావ్‌రా.. బద్మాష్, ఆకలిగొట్టెదవలందర్ని మేపడానికి’ అంటూ వాడి రెండు చెంపలూ బలంగా వాయించి ‘ఈ ఎదవను బైటికి నెట్టండిరా’ అంటూ తన అనుచరులకు ఆజ్ఞాపించి ఆ విస్తరిని బయటకి గిరాటేశాడు. అతని అనుచరులు పిడిగుద్దులు గుద్దుకుంటూ వాడ్ని బయటకు లాక్కుపోతున్నారు. ‘ఇంకెందరున్నారో ఇట్లాంటెదవలు’ అనుకుంటూ అట్లాంటి వెధవల వేటకు బయల్దేరాడు పంక్తులన్నీ వెతుకుతూ.
ఇబ్బందిగా లేచి చేతులు కడుక్కుని బయలుదేరాం. ఇవతలకు రాగానే నా స్నేహితుడు కనిపించి ‘కాసేపుండవోయ్, మీ వాళ్లను కారులో పంపుదాం’ అంటూ నా మాటైనా వినకుండా డ్రైవర్‌కు ఆ పని పురమాయించాడు. చేసేదేమీ లేక మిన్నకుండిపోయా. రద్దీ కొద్దిగా తగ్గింది. తన వియ్యంకుడి కుటుంబాన్ని, బంధువుల్ని, ఇతర ఉన్నతాధికారుల్నీ పరిచయం చేస్తూ పోతున్నాడు హుషారుగా. ఎప్పుడు బయటపడదామా? అన్నట్టుంది నాకు. ఇంతలో ఎవరో మీఠా పాన్ తెచ్చిచ్చారు. అది నముల్తూ గేటు దగ్గరకొచ్చా.
గేటు ముందు మిడతల దండులా బిచ్చగాళ్లు. ఖాళీ కడుపులు, ఖాళీ గినె్నలు చూపుతూ దీనాతిదీనంగా యాచిస్తున్నారు. వస్తాదులాంటి మరొక వ్యక్తి ఓ పేద్ద లాఠీ తీసుకుని ‘సుట్టాలొచ్చిన్రు.. సుట్టాలు..! ఆళ్లందరు తినక ముందట్నె ఒడ్డించాలె! నడువుండ్రి ఎదవముండలాల! ఎదవ ముండకొడుకులాల!’ అంటూ తరుముతున్నాడు. ‘గింతంత పెట్టిచ్చయ్యా, శాన పొద్దుపోయింది, ఆకలైతంది’ అంటూ ఆక్రోశిస్తున్నారు వాళ్లంతా దెబ్బలు తింటునే. సెక్యూరిటీ గార్డులొచ్చి తరిమి తరిమి కొట్టారు అందర్నీ.
ఉండలేకపోతున్నా వాడి దగ్గరకెళ్లి ‘నేనొస్తానోయ్’ అన్నా మరోసారి. ‘కాసేపుండవోయ్, ఏముందంత తొందర! ఎన్నాళ్ల తరువాతో కలిసాం’ అంటూ ఆప్యాయత ఒలకపోశాడు. ఇంకొద్దిసేపు ఉండక తప్పేట్టు లేదు.
అందరి భోజనాలు అయ్యాయి. ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయారు-వియ్యంకులూ వాళ్ల పరివారమూ మినహా. కాసేపట్లో వాళ్ల భోజనాలూ అయ్యాయి.
సిగరెట్టు అంటించుకుని ఓ మూలకెళ్లి నించున్నా. కుండీలకొద్ది అన్నము, బేసిన్లకొద్దీ బిర్యానీ. కూరలు ఎత్తుకొచ్చి మురుగు కాలువల్లో పారబోస్తున్నారు. కాలువలన్నీ వాటితో నిండిపోయాయి.
ఇహ మా వాడితో చెప్పకుండానే బయలుదేరా. వీధులనిండా, పేవ్‌మెంట్ల మీదా రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్‌ల మీదా, బస్టాండుల నిండా అన్నార్తులు పేగులు మెలిపెట్టే ఆకలితో కడుపులో కాళ్లు పెట్టుక పడి ఉన్నారు. కొందరు నిద్రపోతూ...కొందరు నిద్ర రాకా...
కడుపులో దేవుతున్నట్టనిపించింది. ఆటోరిక్షా మాట్లాడుకుని ఇంట్లో పడ్డా తొందరగా.
కడుపులో మరింత దేవుతున్నది. గబగబ వాష్‌బేసిన్ దగ్గరకుపోగానే భళ్లున వాంతైంది.
‘ఏమైంది నాన్నా?’ అంటూ పరిగెత్తుకొచ్చారు పిల్లలు.
‘ఏదో పడలేదట్టుంది’ అంటున్నది వింధ్య.
‘డాక్టరు దగ్గరకు పోదాం పద నాన్నా..’ మావాడు ఆందోళనతో అంటున్నాడు.
‘పూర్తిగా వాంతైంది లే! ఇప్పుడు హాయిగా ఉంది. కంగారు పడకండి’ అన్నా మా అమ్మాయి అందించిన మంచినీళ్ల గ్లాసు అందుకుంటూ. *

No comments:

Post a Comment